🔹 ఆర్.కె న్యూటెక్ గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
🔹 డిప్యూటీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన కార్మికులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గని కార్మికులపై అండర్ గ్రౌండ్ అలవెన్స్ రికవరీ పేరిట యాజమాన్యం అదనపు భారం మోపడం తగదని సీఐటీయూ శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో కంపెనీ అవసరాల నిమిత్తం సర్ఫేస్ లో పనిచేసిన కార్మికులకు చెల్లించిన అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఇప్పుడు తిరిగి వసూలు చేస్తామంటూ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం గనిపై సంతకాల సేకరణ చేపట్టారు. అసిస్టెంట్ పిట్ సెక్రటరీ అరిగే సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ సభ్యులు కస్తూరి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. కంపెనీ అవసరాల కోసమే కార్మికులు గతంలో సర్ఫేస్ లో విధులు నిర్వహించారని, అప్పట్లో ఆ భత్యాన్ని పట్టించుకోకుండా, ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు రికవరీ చేస్తామని లెటర్లు ఇవ్వడం కార్మికులను ఇబ్బందులకు గురిచేయడమేనని మండిపడ్డారు. ఈ సమస్యపై గతంలోనే మాట్లాడామని చెబుతున్న గుర్తింపు సంఘం, క్షేత్రస్థాయిలో రికవరీ లెటర్లు వస్తున్నా అడ్డుకోవడంలో విఫలమైందని చంద్రశేఖర్ విమర్శించారు. పాత రికవరీల పేరుతో కార్మికుల వేతనాల్లో కోత విధించడం సరైనది కాదని, యాజమాన్యం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గని షిఫ్ట్ ఇంచార్జ్, డిప్యూటీ మేనేజర్ సాత్విక్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీకాంత్, రాజయ్య, రమేష్, ప్రతాప్, లింగమూర్తి, తిరుపతి, రవి రాజేష్, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.





