- రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి. సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో నాలుగు డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్తవారిని నియమించడం లేదని, పాత డైరెక్టర్ల పదవి కాలం పొడిగించడం లేదని, సంస్థ అడ్మినిస్ట్రేషన్ కుప్పకూలే పరిస్థితి రావొచ్చని, ప్రభుత్వ పెద్దల మాట వినే వారికే డైరెక్టర్ హోదా దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోందని పేర్కొన్నారు. సేవ్ సింగరేణి నినాదంతో సంస్థ పరిరక్షణకు తమ వంతు పోరాటాలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో సీఎండీ స్థాయి స్ట్రక్చర్ సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు రావడం లేదని, సింగరేణికి రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని అన్నారు. సింగరేణిలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయడం లేదని, ఇతర కార్మిక సంఘాలు ఏఐటీయూసీ బదనాం చేయడం మానుకోవాలన్నారు. డైరెక్టర్ (పా) స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సంబంధించిన సర్క్యులర్ విడుదల చేయకపోవడంతో అమలుకు నోచుకోలేదన్నారు. కంపెనీ అవసరాల నిమిత్తం సర్ఫేస్ లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించాలన్న సర్క్యూలర్ ను ఆడిట్ డిపార్ట్మెంట్ వారు పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల మారుపేర్ల సమస్య, పెర్క్స్ పై ఐటీ చెల్లింపు, సొంతింటి పథకం, డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించడం వంటి పలు అంశాలు సీఎండీ స్ట్రక్చర్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందన్నారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలకు సంబంధించిన జీవో 22ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, సింగరేణి యాజమాన్యం అమలు చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోతుకూరి కొమురయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు ప్రసాద్ రెడ్డి, నాగభూషణం, రాంచందర్, మల్లేష్, మురళి చౌదరి, సారయ్య, లక్ష్మణ్, సదానందం, నవీన్ రెడ్డి, సందీప్, పరశురామ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.