శోభాయాత్రగా చిత్రపటాల ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో ఏఎస్ఆర్ఆర్ నగర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్‌లో గల అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి వరకు అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏఎస్ఆర్ఆర్ నగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బోయిని కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సంగనబట్ల నరహరిశర్మ గురుస్వామి పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అయ్యప్ప, గణపతి, కుమారస్వామి చిత్రపటాలను కాలనీలో భక్తులు, స్వాములు శోభాయాత్రగా పూజా మందిరం వరకు తీసుకువచ్చారు. పడిపూజలో భాగంగా 18 కలశాలతో, 18 రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల కాలు భజన, అఖండ భజనలతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సమితి శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లచ్చన్న, రాష్ట్ర మీడియా ఇంచార్జి భాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు రఘుపతిరావు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు కొత్తగట్టు శ్రీనివాసచారి, ముల్కల రవికృష్ణ, అప్పయ్య, నగేష్, అరుణ్ కుమార్, సంపత్, ప్రసాదాచారి, ఆలయ కార్యదర్శి ముత్తె రాజయ్య, లక్ష్మణరావు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





