భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం
పోటెత్తిన భక్తులు.. 21 జంటలతో సత్యనారాయణ సామూహిక వ్రతాలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన వెలసిన చారిత్రక ప్రసిద్ధ గౌతమేశ్వరాలయం గురువారం శివనామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన గురువారం కావడంతో ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 21 జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పూజలు చేశారు. గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడినట్లుగా పురాణ ప్రశస్తి కలిగిన ఈ ఆలయంలో, పార్వతీదేవి, నందీశ్వరుడు, వినాయకుడితో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వుత్తూరి దివ్య – రవీందర్ దంపతులు తమ కుమార్తె ‘శాన్విత’ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. పూర్ణిమ, ఏకాదశి, మరియు గురువారం వంటి పర్వదినాల్లో ఇక్కడ వ్రతాలు, అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





