ఇద్దరు దొంగలు అరెస్ట్, నగదు రికవరీ
వివరాలు వెల్లడించిన సిసిసి నస్పూర్ ఎస్ హెచ్ ఓ యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులను దొంగిలించిన కేసును సిసిసి నస్పూర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్ హెచ్ఓ యు. ఉపేందర్ రావు వెల్లడించారు. నస్పూర్ మండలం గాంధీనగర్‌కు చెందిన పురాణం రాంచందర్ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న షెడ్డులో నివాసం ఉంటూ, ఇంటి పనుల కోసం రూ. 94,000 నగదును ఒక ఇనుప పెట్టెలో దాచుకున్నాడు. కాగా, గత నెల 30వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షెడ్డులో చొరబడి ఆ డబ్బును అపహరించారు. బాధితుడు ఈనెల 1న ఉదయం లేచి చూసేసరికి డబ్బులు కనిపించకపోవడంతో వెంటనే సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ హెచ్ఓ ఉపేందర్ రావు దర్యాప్తు వేగవంతం చేశారు. సిసి టివి ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. మంచిర్యాల ఒడ్డెర కాలనీకి చెందిన బోసు తరుణ్, ఉప్పల రాకేష్, సంజయ్ అలియాస్ చిన్ని ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. పోలీసులు బోసు తరుణ్, ఉప్పల రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తులో రూ. 70,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు సంజయ్ అలియాస్ చిన్ని పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.





