సేఫ్టీ ప్లాన్స్‌పై అవగాహన తప్పనిసరి
ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, కమిటీ కన్వీనర్ జి.కృష్ణమూర్తి
శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో ఘనంగా 56వ రక్షణ పక్షోత్సవాలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగులు ఉత్పత్తి సాధనలో రక్షణను మరువకూడదని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్, రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ (బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్) జి. కృష్ణమూర్తి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో సోమవారం 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ (బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్) జి. కృష్ణమూర్తి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంస్థలో రక్షణ పక్షోత్సవాలను జరుపుకోవడం ఒక ఆనవాయితీ మాత్రమే కాదని, అది మన బాధ్యత అని గుర్తుచేశారు. కంపెనీ వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఉద్యోగి ‘సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్స్’ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరిస్తూ, తమ రక్షణతో పాటు సహచర ఉద్యోగుల రక్షణను కూడా ఎల్లవేళలా గమనించాలన్నారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించే క్రమంలో రక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని, రక్షణతో కూడిన పని విధానంతోనే సంస్థ పురోగతి సాధ్యమని స్పష్టం చేశారు. రక్షణ పక్షోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ జి. కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిరోజూ రక్షణ ప్రతిజ్ఞతోనే ఉద్యోగులు తమ విధులను ప్రారంభించాలని సూచించారు. తాము సీహెచ్‌పీని సందర్శించిన సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పని విధానాన్ని, వారు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రత్యక్షంగా తనిఖీ చేశామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు, వాటి కారణాలను రక్షణ కమిటీ సభ్యులతో చర్చించామని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై దిశానిర్దేశం చేశామని తెలిపారు. వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన ట్రేడ్ మెన్ టెస్టులలో విజేతలుగా నిలిచిన వారికి, అలాగే విధులను సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేసిన ఉత్తమ ఉద్యోగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అతిథులు ప్లాంట్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం కమ్యూనికేషన్ సెల్ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రక్షణ గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏరియా ఇంజనీర్ టి. రమణ రావు, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, సీహెచ్‌పీ స్టాట్యూటరీ మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, సీహెచ్‌పీ ఇన్చార్జి చంద్రలింగం, పిట్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు, రక్షణ కమిటీ సభ్యులు, సీహెచ్‌పీ ఉద్యోగులు తదిరులు పాల్గొన్నారు.





