జీఎం (పర్సనల్) కిరణ్ కుమార్
శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్, వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్) జీవీ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలో కారుణ్య నియామకాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో జీఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. అలాగే, సాధారణ పదవీ విరమణ పొందిన వారితో పాటు, మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ కేసులను ఎటువంటి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను కొలిక్కి తీసుకురావడానికి సరైన విధివిధానాలను రూపొందించుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్సనల్ విభాగానికి సంబంధించిన ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయాలని, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీవై పీఎం ఎం. రాజేష్, సీనియర్ పీవో ఎస్. సురేందర్, ప్రశాంత్, గనుల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







