– ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దోమల నాగేంద్ర
– పదవ విద్యార్థులకు సైకాలజిస్ట్ లచే అవగాహన సదస్సు
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: ఉన్నత లక్ష్యమే విజయానికి పునాది అని, విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దోమల నాగేంద్ర తెలిపారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకై ప్రధానోపాధ్యాయుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టి.పి.ఏ) జిల్లా సలహాదారుడు, సైకాలజిస్ట్ గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం కోటపల్లి మండలంలోని పారుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ సైకాలజిస్ట్ లచే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పోగొట్టి, ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయడానికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దోమల నాగేంద్ర, టి.పి.ఏ రాష్ట్ర బాధ్యులు బి. నారాయణరావు, గుండేటి యోగేశ్వర్, పరీక్షలు విజయవంతంగా ఎదుర్కోవడంలో మెళుకువలు, లక్ష్యసాధన, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు, బలాలు బలహీనతలు, వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు దోమల నాగేంద్ర మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే సోపానం, లక్ష్యమే జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంపొందిస్తుందని విద్యార్థులకు సూచించారు. అనవసరమైన ఆకర్షణలను అధిగమిస్తేనే విజయాలు చేరువవుతారని అన్నారు. పరీక్షల ముందు బలహీనతను అధిగమించి, ప్రణాళిక బద్ధంగా చదువుకుని పదవ తరగతిలో పది జి.పి.ఏ సాధించే పలు మెళకువలపై అవగాహన కలిగించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఆనందమయ జీవితం సొంతం చేసుకునే విధానాలు తెలియజేశారు. అనంతరం ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులకు నాగేంద్ర తాను రచించిన “విద్యార్థి విజయం” పుస్తకాలు బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎం.ఈ.ఓ పి. తిరుపతి రెడ్డి ,ఎం.ఎన్. ఓ చిందం మొగిలి, దేవులవాడ కాంప్లెక్స్ హెచ్.ఎం కే. దామోదర్ రెడ్డి, పి. వెంకటేశ్వర్, ఉపాధ్యాయులు టీ. పావని, బి. బిక్కు, బి.నర్సింగ్, ఏ. సతీష్, పి. వాణి, శ్రీ విలాస్ యాదవ్, కె . సంతోష్, పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.