- టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: టీచర్స్ ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి తెలిపారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా 37 సంవత్సరాల అనుభవం తనకు ఉపాధ్యాయుల సమస్యల పై పూర్తి స్థాయి అవగాహన ఉందని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉపాధ్యాయుల సమస్యల పై ఎన్నో పోరాటాలు చేశానని చెప్పారు. సిపిఎస్ రద్దు కోసం శాయశక్తులా పోరాడుతానని, సిపిఎస్ రద్దు అయితే ఉపాధ్యాయులకు భవిష్యత్తు పై భద్రత, భరోసా ఉంటుందన్నారు. గత ఎమ్మెల్సీలు మాటల వరకే పరిమితమయ్యారని, ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం రాలేదని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనకు టీచర్స్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు, మోడల్ స్కూల్, గురుకుల, కేజీబీవీ టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం, పెండింగ్ మెడికల్ బిల్స్ వచ్చేలా చేస్తానని, ఎమ్మెల్సీ నిధులతో జిల్లా కేంద్రాల్లో టీచర్స్ భవన్ నిర్మాణం చేపడుతానని పేర్కొన్నారు. రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎస్ అమలులో లేదని, ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలన్నారు.