71
నస్పూర్, ఆర్.కె న్యూస్: వనితా వాక్కు ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అందిస్తున్న సేవలకు గాను మంచిర్యాల జిల్లాకు చెందిన అడ్వకేట్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ కు మైండ్ సపోర్ట్ హిప్నోసిస్, కౌన్సిలింగ్ సంస్థ వారు ఎక్సలెన్స్ ఇన్ లీడర్ షిప్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని మైండ్ సపోర్ట్ హిప్నోసిస్, కౌన్సిలింగ్ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హిప్నోసిస్ అవార్డ్స్- 2025 కార్యక్రమంలో నూతనంగా హిప్నోథెరపీ సేవలు అందిస్తున్న హిప్నోథెరపిస్టులకు ‘కిక్ స్టార్ట్’ అవార్డులు, సమాజ శ్రేయస్సు కోసం వివిధ రంగాల్లో సేవలను అందిస్తున్న పలువురికి లీడర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ డైరెక్టర్, హిప్నోసిస్ కోచ్ శశికిరణ్, ప్రెసిడెంట్ దేవాన్షి మాట్లాడుతూ, దేశ పురోగతికి తోడ్పడేలా ఎక్కువ మంది హిప్నోథెరపిస్టులను తీర్చిదిద్దడం, సైకాలజిస్టులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఇప్పటికే ఉన్న హిప్నోథెరపిస్టులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. తమ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో అద్భుతమైన థెరపీలు అందిస్తుండటం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ప్రసన్నహరికృష్ణ మాట్లాడుతూ, యువతను చైతన్య పరుస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్న మైండ్ సపోర్ట్ సంస్థ, సంస్థ డైరెక్టర్ శశికిరణ్ కు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రామచందర్ మాట్లాడుతూ, మానసిక రుగ్మతలను తొలగించడంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. అనంతరం రంగు వేణు కుమార్ మాట్లాడుతూ, తాను స్థాపించిన వనితా వాక్కు ఫౌండేషన్ ద్వారా మహిళలు, ఆడపిల్లల రక్షణ, భద్రత, సాధికారత కోసం చేస్తున్న సేవలు, తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సమాజంలోనీ మానసిక రుగ్మతులను రూపుమాపే దిశగా చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు పొందినట్లు తెలిపారు. నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేసిన వారిని గుర్తించి ఇలాంటి అవార్డులు అందజేయడం సంతోషకరమని, తద్వారా ఎంతో మంది ప్రేరణ పొందుతారని అన్నారు.