32
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో పూర్తి సర్వీస్ కాలం విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పలువురు ఉద్యోగులను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు, ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు నేతృత్వంలో శ్రీరాంపూర్ ఏరియాలో గనులు, విభాగాలలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి, స్వీట్ బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి నాయకులు మాట్లాడూతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో సుదీర్ఘ కాలం ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను, పరస్పర సహకారాలను, స్నేహబంధాలను గుర్తు చేసుకున్నారు. సంస్థ అభివృద్ధిలో వారు పోషించిన పాత్రను ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు, బ్రాంచ్ నాయకులు, పిట్ కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





