– ఓటరు జాబితా పర్యవేక్షకులు అహ్మద్ నదీం
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర కార్మిక శాఖ కమీషనర్, ఓటరు జాబితా పర్యవేక్షకులు అహ్మద్ నదీం అన్నారు. శనివారం మంచిర్యాల, నిర్మల్ జిల్లాల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు బదావత్ సంతోష్, వరుణ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ తో కలిసి జిల్లాల అధికారులు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా తయారుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పర్యవేక్షకులు మాట్లాడుతూ 2వ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన అందరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేసే విధంగా అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్లు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి స్థానిక బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సమీక్షించుకొని భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల వివరాలు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా దృష్టి సారించాలని, చిరునామా మారిన వారు తమ ఓటును ప్రస్తుత నివాసం పరిధిలో పోలింగ్ కేంద్రానికి మార్చుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నిస్పక్షపాతంగా, పారదర్శకంగా ఎలాంటి పొరపాట్లు లేని 100 శాతం స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని, ఎన్నికల ఓటరు నమోదు అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు అవకాశం ఉన్నందున నూతన ఓటరు నమోదు, జాబితా సవరణలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారు చేయాలని తెలిపారు. ఇందు కొరకు ఆగస్టు 26, 27, ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందని, ఈ శిబిరాలలో దరఖాస్తులు స్వీకరించి పరిశీలించడం జరుగుతుందని, జిల్లాలో వయసు అర్హత గల ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు తమ ఓటు నమోదు చేసుకొనేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఓటరు జాబితా సంబంధించిన 6, 7, 8 దరఖాస్తు ఫారములు బూత్ స్థాయి అధికారుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ నెల 28న ఫిర్యాదులు, అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 1వ తేదీన భారత ఎన్నికల సంఘం అనుమతి మేరకు పూర్తి వివరాలతో సమగ్రమైన తుది ఓటరు జాబితా రూపొందించి అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించేందుకు అధికారులు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ జాబితా ఆధారంగా వచ్చే సాధారణ శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.