✅ అక్టోబర్ 31 గురుదాస్ గుప్తా వర్ధంతి, ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు,కార్మిక ఉద్యమ నేత, ప్రభుత్వ రంగ సంస్థలు, బీమా, రక్షణ రంగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అటూ కార్మిక క్షేత్రంలో, పార్లమెంట్ లో తన గొంతుకను వినిపించిన అలుపెరగని, మడమ తిప్పని గొప్ప పార్లమెంటేరియన్ గురుదాస్ గుప్తా. బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో ఉన్న బరిసల్ లో దుర్గా ప్రసాద్ గుప్తా, నిహార్ దేవి దంపతులకు 1936 నవంబర్ 3న జన్మించారు. విద్యార్థి నాయకుడిగా 1957లో అశుతోష్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ కు జనరల్ సెక్రటరీగా, అవిభక్త బెంగాల్ ప్రావెన్షియల్ స్టూడెంట్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1950 నుంచి 1960 వరకు చాలా సార్లు అరెస్ట్ కాబడినారు.1965 జూన్ 18 న జయశ్రీని వివాహం చేసుకున్నారు.1967 నుంచి 1977 వరకు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పశ్చిమ బెంగాల్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, 1970లో బుడాపెస్ట్ లో యువజన కాంగ్రెస్ కు భారత ప్రతినిధి బృందం కు నాయకత్వం వహించారు. 1964 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ ఏఐటీయూసీ అనుబంధ భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ కు ఉపాధ్యక్షులుగా ఉండి 25 సంవత్సరాలు పార్లమెంటేరియన్ పని చేశారు.
1985,1988,1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2001లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా, 2004 లో సీపీఐ జాతీయ సెక్రటేరియట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో పశ్చిమ బెంగాల్ లోని పాన్స్ కురా నుంచి 14వ లోకసభకు, 2009లో అదే పశ్చిమ బెంగాల్ లోని ఘటల్ నుంచి 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు. గురుదాస్ గుప్తా హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ కేసులో జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యునిగా, నికోలస్ పిరామల్ ఆర్థిక కుంభకోణంను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు. పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ సాధన గళం వినిపించిన నేత గురుదాస్ గుప్తా.
ఆయన జాతీయ స్థాయి నాయకునిగా ఉండి పలు సార్లు హైదరాబాద్ లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొని కార్మిక నాయకులకు దిశ, దశ చూపించారు. బొగ్గు గనుల ప్రాంతం మంచిర్యాల జిల్లా నస్పూర్ లో 4-4-2010 రోజున ఏఐటీయూసీ కార్యాలయానికి శంఖుస్థాపన చేసి మరల 29-4-2012 లో ప్రారంభోత్సవంలో పాల్గొని కార్మికులను ఉద్దేశించి చేసిన ఉత్తేజకరమైన ప్రసంగాన్ని ఇప్పటికీ సింగరేణి కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వరంగ సంఘాలకు, ప్రైవేట్ రంగ కార్మిక సంఘ సమఖ్యాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఎన్నికై కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు చేసి కార్మిక వర్గానికి మేలు చేసిన గొప్ప ఆదర్శవాది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి తెచ్చి ప్రజలకు పంచాలని పార్లమెంట్ లో పోరాడిన ఏకైక వ్యక్తి గురుదాస్ గుప్తా.
సీపీఐ పార్టీకి ప్రధాన కార్యదర్శి పని చేయమని కోరితే తిరస్కరించి తాను కేవలం తాను జీవితాంతం కార్మిక వర్గానికి ప్రతినిధిగా జీవిస్తానని, సాదా సీదా బట్టలు వేసుకొని నిరాడంబరంగా జీవించిన మహనీయుడు. భార్య జయశ్రీ దేవి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎవరి సహాయం తీసుకోకుండా ఢిల్లీలో కేసంగ్ వీధిలో కాలం గడిపారు. దాదాపు 17 సంవత్సరాలు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి చివరి రోజుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి తన 83వ ఏట 2019 అక్టోబర్ 31న కోల్ కత్తాలో ఆయన స్వగృహంలో తుది శ్వాస వదిలారు. విచిత్రంగా తాను పని చేసిన భారత దేశంలో ప్రప్రథమ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆవిర్భవించిన తేదీ కూడా అక్టోబర్ 31 కావడం యాదృచ్ఛికం. గురుదాస్ గుప్తా అమరుడైనప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత నేటి తరం నాయకులదే.
✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.