ఐఎన్టీయూసీ నేత జెట్టి శంకర్ రావు
శ్రీరాంపూర్ జీఎం, డీజీఎం (పర్సనల్)లకు ఐఎన్టీయూసీ నేతల నూతన సంవత్సర శుభాకాంక్షలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్లను ఐఎన్టీయూసీ నాయకులు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో కార్మికుల భద్రతకు యాజమాన్యం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే లక్ష్య ఉత్పత్తి సాధనలో మరింత విశేష కృషి చేయాలని సూచించారు. అలాగే, ఉత్పాదకతను పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యాన్ని కోరారు. దీనికి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ, సంస్థాగత సంస్కరణలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ యూనియన్ నాయకత్వం యాజమాన్యానికి తమ సహాయ, సహకారాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగే స్వామి, తిరుపతి రాజు, జీవన్ జోయల్, ల్యాగల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మనోజ్, చంద్ర మోహన్, జీవన్ రావు, ఓరం జగన్ తదితరులు పాల్గొన్నారు.







