జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య-ఆరోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది డెంగ్యూ వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రతి మున్సిపల్ పరిధిలో వైద్యాధికారులు సమీక్ష నిర్వహించుకొని ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సిబ్బంది ద్వారా స్ప్రే, పైరిత్రివ్, పారిశుద్ధ్యం, నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ సిబ్బంది, బ్రీడింగ్ చక్కర్లు అనుసంధానం చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఆదివారం ఉదయం 10.10 గం||లకు ప్రతి ఇంటిలో డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలని, ప్రతి రోజు డ్రై డే కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు తమ గ్రామాలలో నిర్వహించనున్న కార్యక్రమాల కార్యచరణ రూపొందించాలని, వైద్య-ఆరోగ్య శాఖ ద్వారా వైద్యాధికారులు ప్రభావిత గ్రామాలను ప్రతి రోజు సందర్శించాలని, సబ్-యూనిట్ అధికారులు ప్రతి రోజు అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలను జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారికి అందించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాలని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ పై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కీటక జనిత వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతివారం వ్యాధుల ప్రభావం పై సమీక్ష నిర్వహించాలని, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ చర్యలపై పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.సి. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డాక్టర్ అనిత, డాక్టర్ నీరజ, డాక్టర్ ఫయాజ్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అరవింద్, డాక్టర్ భీష్మ, 11 82, డాక్టర్ అశోక్, మున్సిపల్ కమీషనర్లు, వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి.లు, సబ్-యూనిట్ అధికారులు, సూపర్వైజర్లు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
254