- జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం ఉదయం జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తన 94 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఉన్నారని, తొలుత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలిచారని, నాన్ ముల్కీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిలుస్తారని అన్నారు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2008లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్ లోని తన గృహాన్ని కార్యాలయంగా వాడుకోవడానికి అంగీకరించారని, 90 సంవత్సరాలు నిండినప్పటికీ అనేక తెలంగాణ సాధన సభల్లో పాల్గొని ప్రసంగించారని, ఆశయం పట్ల గొప్ప నిమగ్నత, నిబద్ధత గల నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి త్యాగధనుల పోరాటాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పొందగలిగామని, వారి త్యాగం, అంకితభావం, పట్టుదల, ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సుభాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవి ప్రసాద్, అడిషనల్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చక్రవర్తి, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నాయకులు బోడభద్రు తదితరులు ఘన నివాళులు అర్పించారు.