శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ప్రశంస
ఎస్వోటు జీఎంకు ఘనంగా సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ అందించిన సేవలు వెలకట్టలేనివని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ కొనియాడారు. శ్రీరాంపూర్ ఏరియాలో సుదీర్ఘకాలం సేవలందించి, త్వరలో పదవీ విరమణ పొందనున్న సత్యనారాయణను మంగళవారం కంపెనీ స్థాయి క్రీడా పోటీల వేదికగా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. క్రీడాకారులు, క్రీడా సంఘ ప్రతినిధులతో కలిసి ఆయనకు శాలువా కప్పి, ప్రత్యేక క్రీడా మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. సత్యనారాయణ క్రీడల పట్ల ప్రత్యేక ఆసక్తితో ఏరియాలోని క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహించారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు సింగరేణి స్థాయిలోనే కాకుండా, కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానాలు సాధించి సంస్థకు పేరు తెచ్చారని గుర్తు చేశారు. యువ క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన వేదికలు, వనరులు కల్పించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందున్నారని ప్రశంసించారు. ఆయన అందించిన సేవలు శ్రీరాంపూర్ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, భవిష్యత్ తరాలకు ఆయన ఒక ప్రేరణ అని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, డీజీఎం (పర్సనల్), చీఫ్ కోఆర్డినేటర్ ఎస్. అనిల్ కుమార్, ఆర్.కె–5 గని ఏజెంట్ శ్రీధర్, డిప్యూటీ సిఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, జాన్ వెస్లీ, పర్సా శ్రీనివాస్, ఎం. నరేందర్ రెడ్డి, సిహెచ్ రమేష్, వివిధ ఏరియాల కోఆర్డినేటర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.







