- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించి ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతాయని, విద్య పై ఏకాగ్రత పెరుగుతుందని, స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు అలవడుతాయని, జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో దోహదపడతాయని అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని, వీటిని సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తితో నిజ జీవితంలో ముందుకు వెళ్ళాలని అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ఖో-ఖో, బాక్సింగ్ లో ఈ పాఠశాల నుండి ఇద్దరు బాలికలు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారని, ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడా రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తకోపహార్, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ జె. ప్రసాద్, ఉపాధ్యాయులు పి. క్రిష్ణా రావు, ఎస్. భాస్కర్, శుభి గుప్తా, సంధ్య, సచిన్, నగేష్, విద్యార్థినీ, విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.