దేశంలో ఆపిల్ పండ్ల సాగులో కాశ్మీర్ తర్వాత రెండో స్థానం హిమాచల్ ప్రదేశ్ దే. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్ పండ్లపై కేంద్రం సుంకం తగ్గించడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆపిల్ పండ్ల ధరలు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు చేయలేక హిమాచల్ ప్రదేశ్ రైతులు చెట్లను నరికి వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి గంజాయి మొక్కల పెంపకం కొరకు పరిమిత సాగుకై అనుమతి ఇచ్చే ప్రతిపాదన సమర్థనీయం కాదు. ఇప్పటికే దేశంలో అక్రమ మాదక, మత్తు పదార్థాల సేవనం వల్ల యువత చెడిపోతోంది. గంజాయిని మూర్ఛ, దీర్ఘకాల నరాల వ్యాధిగ్రస్తుల ఉపశమనం కొరకు ఉపయోగించే మందుల తయారీకి ప్రత్యేక పర్యవేక్షణలో వాడుతుంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఔషధ, శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం గంజాయి సాగు రైతులకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇదే అదనుగా నేరగాళ్లు దొంగచాటుగా అక్రమంగా గంజాయి సాగు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ పొరుగు రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువని జగమెరిగిన సత్యం. మరొక పొరుగు రాష్ట్రం గుజరాత్ లో ఉన్న ఓడరేవుల నుంచి అక్రమ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డ వైనం తెలిసిందే. పనామా, కొలంబియా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కొకైన్, హెరాయిన్, నల్ల మందు లాంటి మాదక ద్రవ్యాల మొక్కల పెంపకం వలన అక్కడి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు బాధపడుతున్నారు. ఇదే అదనుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి గంజాయి సాగు కొరకు రైతుల పేరిట శతృదేశం పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటు దారులు ప్రవేశిస్తే దేశ భద్రతకు ప్రమాద ముప్పు పొంచి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులను ఆదుకోవాలంటే గంజాయి సాగుకు అనుమతి ఇవ్వకుండా అక్కడి నేల, వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వేరే పంటకు అనుమతి ఇవ్వాలి తప్ప గంజాయి సాగుకు అనుమతి ఇవ్వరాదు.
ఆళవందార్ వేణు మాధవ్
హైదరాబాద్, 8686051752
240