- శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించాలి
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చింతపండు వాడలోని సిద్ధి వినాయక మండపం, 100 ఫీట్ రోడ్ లోని అంజనీ పుత్ర గణేష్ మండపంతోపాటు మరి కొన్ని ప్రధాన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు రామగుండం సీపీ ఆదివారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రామగుండం సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు పోలీసు శాఖ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ లను చెక్ చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తదితరులు ఉన్నారు.