సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమల రావు
శ్రీరాంపూర్‌లో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ భేటీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమమే లక్ష్యంగా యాజమాన్యం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమల రావు పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సీఓఏ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (రిజి. నెం. 7856/2001) కేంద్ర కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు, సంఘం కేంద్ర కమిటీలో ఖాళీగా ఉన్న పలు కీలక పదవులకు నూతన ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గిరిజన పోరాట యోధులు సంత్ సేవలాల్, కొమరం భీం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. కేంద్ర కమిటీ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్ఓఆర్ అంశంపై అసోసియేషన్ ప్రతినిధులు చర్చించారు. సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ధారావత్ పంతుల మాట్లాడుతూ.. ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే డైరెక్టర్ (పా)తో చర్చించి, గిరిజన ఉద్యోగుల సమస్యలపై మేనేజ్మెంట్తో ప్రత్యేక రివ్యూ సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏరియా స్థాయి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని జీఎం ఎం. శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. కేంద్ర కమిటీలో ఖాళీగా ఉన్న పదవులకు ఈ సందర్భంగా ఎన్నిక నిర్వహించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. తిరుమల రావు డైరెక్టర్‌గా పదోన్నతి పొందడంతో, ఆ స్థానానికి భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీ–2 ప్రాజెక్ట్ ఆఫీసర్ వాసం బిక్షమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ట్రెజరర్‌గా తేజావత్ వీరన్న (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కార్పొరేట్ ఆఫీస్), జాయింట్ ట్రెజరర్‌గా సురేష్ (ఇల్లందు ఏరియా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగరేణి డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఎం. తిరుమల రావును, సంఘం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ సెంట్రల్ కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే నూతనంగా ఎన్నికైన కేంద్ర కమిటీ ప్రతినిధులను, వివిధ ఏరియాల లైజన్ ఆఫీసర్లను ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ భూక్య నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్, ఎస్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ధరావత్ రాజేష్, వివిధ ఏరియాల కమిటీ సభ్యులు, గిరిజన అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








