ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు నస్పూర్ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్నలు మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివని, బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తొలి, మలిదశ తెలంగాణ పోరాటంలో ఆయన పాల్గొన్నారని, తన జీవిత కాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలివేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని, రాష్ట్ర చేనేత సహకార రంగానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. 1996 నుంచి మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా అండగా నిలిచారని, తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే పురుడు పోసుకుందని, తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారని, 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం వేముల సురేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలువేరు సదానందం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, బొడ్డున రామ్మూర్తి, చిలువేరు శరబంధం, కుందారపు రాములు, కుందారపు రమేష్, క్యాతం రాజేష్, యాదగిరి, సత్యనారాయణ, అనిల్ కుమార్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
138