క్రీడలతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని శాంతి మైదానంలో వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్ క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఒలింపిక్ పతాకాన్ని ఆవిష్కరించి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ రోజువారీ విధి నిర్వహణలో నిమగ్నమవుతూనే, క్రీడల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని, ఇది సంస్థలో ఆరోగ్యవంతమైన పని వాతావరణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి, సింగరేణి సంస్థ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారుల ప్రోత్సాహం కోసం మైదానాలు, స్టేడియంలు, సీఈఆర్ క్లబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించిందని జీఎం తెలిపారు. యువ క్రీడాకారులు వీటిని సమర్థవంతంగా వినియోగించుకొని క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా త్రోబాల్, రన్నింగ్, త్రోస్, లాంగ్ జంప్ పోటీలను నిర్వహించారు. పురుషుల విభాగంలో రన్నింగ్, లాంగ్ జంప్, త్రోస్, స్విమ్మింగ్ పోటీలను ఏర్పాటు చేశారు. వివిధ ఏరియాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం, స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, డీజీఎం (పర్సనల్), చీఫ్ కోఆర్డినేటర్ ఎస్. అనిల్ కుమార్, ఆర్.కె 5 గని ఏజెంట్ శ్రీధర్, డిప్యూటీ సిఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, జాన్ వెస్లీ, పర్సా శ్రీనివాస్, ఎం. నరేందర్ రెడ్డి, సిహెచ్ రమేష్, కోఆర్డినేటర్ ఎస్. నరసయ్య, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్, వివిధ ఏరియాల కోఆర్డినేటర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.







