చోరీకి గురైన ఆటో లభ్యం
పోలీసుల సహకారంతో డ్రైవర్‌కు అప్పగింత
నస్పూర్ , ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీకి చెందిన ఆటో డ్రైవర్ రవికి చెందిన ఆటో ఇటీవల చోరీకి గురైంది. జీవనాధారమైన ఆటో కనిపించకపోవడంతో ఆ నిరుపేద కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. అయితే, ఫ్లడ్ కాలనీలోని ఒక లారీ యార్డ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆటోను వదిలి వెళ్లినట్లు స్థానిక యువకులు గుర్తించారు. వారు వెంటనే నస్పూర్ యూనియన్ సభ్యులైన అగ్గు సంపత్, సాగర్‌లకు సమాచారం అందించారు. యూనియన్ సభ్యులు వెంటనే స్పందించి, పోలీసుల సహకారంతో అక్కడికి చేరుకున్నారు. అది రవికి చెందిన ఆటోగానే గుర్తించి, అతనికి సమాచారం అందించారు. తన కుటుంబానికి ఆధారమైన ఆటో తిరిగి దొరకడంతో డ్రైవర్ రవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమయానికి స్పందించి ఆటోను గుర్తించడంలో తోడ్పడిన నస్పూర్ ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, పోలీసు అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నిజాయితీకి మారుపేరుగా నస్పూర్ ఆటో యూనియన్
నస్పూర్ ఆటో యూనియన్ సభ్యులు గతంలోనూ తమ నిజాయితీని చాటుకున్నారు. ఇటీవల ఒక పురోహితుడు ఆటోలో మర్చిపోయిన సెల్ ఫోన్‌ను, అంతకుముందు ఒక మహిళకు చెందిన ఫోన్‌ను వారికి తిరిగి అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఆటో డ్రైవర్ల వరుస సేవా కార్యక్రమాలు, నిజాయితీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ షిర్కే కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు మాలేం జగదీష్, కోశాధికారి ఆకుల సూరి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.





