- సింగరేణి క్వాలిటీ షీల్డ్ దక్కించుకున్న శ్రీరాంపూర్ ఏరియా
- ఈ ఏడాది ఇప్పటి వరకు 80 శాతం బొగ్గు ఉత్పత్తి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు నాణ్యతలో శ్రీరాంపూర్ ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. 75 శాతం క్వాలిటీని సాధించి, ఇటీవల జరిగిన నాణ్యత వారోత్సవాల ముగింపులో సీఎండీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక షీల్డ్ ను అందుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏరియా ప్రగతిని ఆయన వివరించారు. నవంబర్ నెలకు గాను 5,88,800 టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఉండగా, 3,43,410 టన్నులు (58 శాతం) సాధించామని జీఎం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (నవంబర్ 30 నాటికి) 42.41 లక్షల టన్నుల లక్ష్యానికి గాను.. 33.75 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ముఖ్యంగా ఆర్కే న్యూ టెక్ గని 113 శాతంతో రికార్డు సృష్టించిందని అభినందించారు. గత నెలలో ఉత్పత్తిని పెంచే చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో రూ. 5 కోట్ల 26 లక్షల విలువైన 75 టన్నుల భారీ హైడ్రాలిక్ క్రేన్‌ను, అలాగే సెక్యూరిటీ విభాగం కోసం రూ. 15 లక్షలతో నిర్మించిన నూతన కార్యాలయ సముదాయాన్ని (ఆఫీస్, రెస్ట్ రూమ్స్) ప్రారంభించినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ఇప్పటి వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా 4,333 మంది దరఖాస్తు చేసుకోగా.. అర్హులైన 3,791 మంది వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని చెప్పారు. మరో 275 మందికి రూ. 25 లక్షల చొప్పున లంసమ్ మొత్తం చెల్లించామని, 20 మందికి ఎంఎంసీ (నెలవారీ పెన్షన్) కింద రూ. 39,069 అందిస్తున్నామని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల్లో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు కనీసం 150 మస్టర్లు (హాజరు) లేని ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అలాగే జీఎం కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు షీ టీం సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈఎస్ఐ ఒప్పంద కార్మికుల నమోదు, అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6 గనుల్లో ‘5 స్టార్ రేటింగ్’ కోసం బెల్లంపల్లి, రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంలు, శ్రీరాంపూర్ జీఎం కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.





