వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నవరాత్రులు అనంతరం నిర్వహించనున్న నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వినాయక నిమజ్జనం కోసం జిల్లాలోని మంచిర్యాల పట్టణం, గుడిపేట గోదావరి తీరంతో పాటు దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నది తీరంలో గుర్తించిన ప్రాంతాలను జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, సబావత్ మోతిలాల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, మంచిర్యాల ఆర్.డి.ఓ. రాములు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18న వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 28న మిలాద్-ఉన్-నబి వేడుకలు ఉన్నందున ప్రజలంతా మత సామరస్యంతో పండుగలు సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. నవరాత్రుల అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మంచిర్యాల ఎ.సి.పి. తిరుపతి రెడ్డి, మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
234