- రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
- శ్రీరాంపూర్ జీఎం ఎల్. వెంకట సూర్య నారాయణ
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ జీఎం ఎల్. వెంకట సూర్య నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మిగిలి ఉన్న 5 నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని, ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అక్టోబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 68 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్.కె 5 గని 82 శాతం, ఆర్.కె 6 గని 96 శాతం, ఆర్.కె 7 గని 72 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 104 శాతం, ఎస్సార్పీ 1 గని 69 శాతం, ఎస్సార్పీ3 గని 80 శాతం, ఐకె 1ఎ గని 78 శాతంతో భూగర్భ గనులు 82 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 91 శాతం, ఐకె ఓసిపి 10 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 68 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఓబీ వెలికితీతలో జాప్యం కారణంగా ఐకె ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏరియాలోని ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. గత నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర, బతుకమ్మ, ఫామిలీ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో రూఫ్ టాప్ గార్డెన్, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో స్టడీ హాల్, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పలు వృత్తి శిక్షణ కోర్సులు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఐకె ఓసీపీ పీవో ఏవి రెడ్డి, డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, సీనియర్ పిఓ కాంత రావు తదితరులు పాల్గొన్నారు.