● శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గని నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని 10 రోజులు ముందస్తుగా సాధించడం హర్షణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ 100 శాతం ఉత్పత్తి సాధించినందుకు గని ఉద్యోగులు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న 24 భూగర్భ గనుల్లో రెండు భూగర్భ గనులు మాత్రమే తమ వార్షిక నిర్దేశిత లక్ష్యాలను సాధించాయని, అవి కూడా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్.కె 5, ఆర్.కె 6 గనులు కావడం చాలా సంతోషకరమని, రాబోవు ఆర్థిక సంవత్సరంలో కూడా ఉద్యోగులు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు గని ఏజెంట్, మేనేజర్ ఎల్లవేళలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత చేయడంలో గని ఉద్యోగులు, అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించారని, గత మూడు సంవత్సరాలుగా తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆర్.కె 5, ఆర్.కె 6 గనులు ముందుంటున్నాయని గుర్తు చేశారు. తదుపరి గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల నిబద్ధత, ఉత్పత్తి లక్ష్య సాధనలో గుర్తింపు సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాల సంపూర్ణ సహకారంతోనే ఇదంతా సాధ్యం అయ్యిందని అన్నారు. గని మేనేజర్ ఎం.డి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్.కె 5 గనికి నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సమిష్టి కృషితో 11 నెలల 20 రోజుల్లోనే అధిగమించినట్లు తెలిపారు. 100 శాతం ఉత్పత్తి సాధించడమే కాక మెరుగైన ఓ.ఎం.ఎస్ శాతం సాధించినందుకు ఉద్యోగులను, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి ఇ.శివయ్య, పిట్ ఇంజనీర్ వి.రాధాకృష్ణ, గని సంక్షేమాధికారి బి.రణదీప్ గౌడ్, ఇతర అధికారులు, ఆర్.కె 5 గని పిట్ సెక్రటరీ జి నర్సింగ రావు, ఏరియా సెక్రటరీ ఎం.ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
201