15 లీటర్ల గుడుంబా స్వాధీనం.. నిందితుడిపై కేసు నమోదు
వేమనపల్లి, ఆర్.కె న్యూస్ : మండల పరిధిలోని మంగెనపల్లి ఎక్స్ రోడ్డు వద్ద శనివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబా పట్టుబడింది. అక్రమంగా గుడుంబాను తరలిస్తున్న దహేగాం మండలం కాల్వడ గ్రామానికి చెందిన బనోతా ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారంతో మంగెనపల్లి చౌరస్తా వద్ద నిఘా పెట్టి వాహనాలు తనిఖీ చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక వ్యక్తి బ్యాగుతో అనుమానాస్పదంగా వేమనపల్లి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేపట్టారు. నిందితుడి వద్ద ఉన్న బ్యాగులో ప్లాస్టిక్ కవర్లలో నింపి ఉన్న 15 లీటర్ల గుడుంబాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు దహేగాం మండలం నుంచి గుడుంబాను తీసుకువస్తున్నట్లు అంగీకరించాడు. పట్టుబడిన గుడుంబాను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







