Rashtriya Swayamsevak Sangh: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత సమన్వయ కమిటీ మూడు రోజుల సమావేశం (సెప్టెంబర్ 14 నుంచి 16వరకు) గురువారం నుంచి పూణెలో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, సహ సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజేషన్ మంత్రి బీఎల్ సంతోష్‌తో సహా 36 సంఘ్ విభాగంలోని సంస్థలకు చెందిన 266 మంది అధికారులు హాజరవుతారు. ఈ సమావేశంలో రామమందిరం సహా దేశానికి, సమాజానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆర్ఎస్ఎస్ కు చెందన ప్రతి సంస్థ తన పని గురించి సమాచారాన్ని ఇవ్వడంతోపాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించనుంది. బుధవారం జరిగిన సమన్వయ సమావేశానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత కొన్నేళ్లుగా సమాజంలో చురుగ్గా పనిచేస్తోందని, సంఘ్ వాలంటీర్లు తమ శాఖల ద్వారా దేశానికి నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. సంఘ్ వాలంటీర్లు శాఖలో పని చేయడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
సెప్టెంబరు 14 నుంచి 16 వరకు పూణెలో 36 సంఘ్ ప్రేరేపిత సంస్థల సమన్వయ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం సర్ పరశురాంభౌ కళాశాల క్యాంపస్‌లో జరగనుంది. చివరిసారి ఈ సమావేశం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.