ప్రభుత్వ భూములను ఆక్రమించిన, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడటంతో పాటు అభివృద్ధిలో జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 311 గ్రామపంచాయతీలు ముందంజలో ఉన్నాయని, భూముల విలువ పెరగడంతో కొందరు ఆక్రమణదారులు అక్రమంగా ప్రభుత్వ భూములలో చొరబడి తప్పుడు పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని నస్పూర్ మండలం నస్పూర్ గ్రామ శివారులోని 42, 64, 119, 52 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమ మార్గంలో సొంతం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని భావించి ఇదే అదనుగా కబ్జాలకు పాల్పడుతున్నారని, పట్టాలు ఉన్నాయని నమ్మబలికి ప్రభుత్వ భూములను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని, కొందరు ప్రహరీ గోడలు నిర్మించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ కొరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములపై ఎల్లవేళలా నిఘా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నస్పూర్ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కొరకు కేటాయించిన ప్రభుత్వ భూములపై క్రయ, విక్రయాలు లాంటివి జరపకూడదని, పట్టణాభివృద్ధి దృష్ట్యా గతంలోనే ప్రభుత్వ భూములపై భూ లావాదేవీలను నిషేధించడం జరిగిందని తెలిపారు. ఇకపై అక్రమ ఆక్రమణలకు పాల్పడిన వారిపై పి.డి. యాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
206