మానవత్వం చాటుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది
బాధితుడికి అండగా నిలిచిన వైద్యులు, తోటి ఉద్యోగులు
రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: తోటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ఇటీవల తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డ్ అసిస్టెంట్లు, ఆయాలు, కార్యాలయ సిబ్బంది మరియు కాంట్రాక్టు ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు సేకరించారు. మొత్తం రూ. 52,200 విరాళాన్ని సిబ్బంది సమీకరించగా, అందులో కుటుంబ అత్యవసరాల నిమిత్తం రూ. 27,200 నగదును గురువారం డిప్యూటీ సీఎంవో (అడ్మిన్) ఎం. మధు కుమార్ చేతుల మీదుగా రాకేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మిగిలిన రూ. 25,000 మొత్తాన్ని రాకేష్ కోలుకునే సమయంలో అవసరాల కోసం వచ్చే నెలలో రెండో దఫాగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంవో మధు కుమార్ మాట్లాడుతూ.. ఏరియా ఆసుపత్రి సిబ్బంది కేవలం వైద్య సేవల్లోనే కాకుండా, సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవడంలోనూ ముందుంటారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని సిబ్బందిని అభినందించారు. మేకల రాజయ్య, సిరికొండ నాగేంద్ర భట్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్రన్ విజయలక్ష్మి, ఆఫీసు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండి మదర్ సాహెబ్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





