- బాధితులకు తక్షణ సహాయం అందించాలి
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: లైంగిక దాడికి గురైన మహిళలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చి, పరిహారం ఇప్పించే వరకు “భరోసా కేంద్రాలు” అండగా నిలుస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిసిసి నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ భవనంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్య సహాయం, సైకాలజిస్ట్, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలు బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని, బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మంచిర్యాల జోన్ లో ఎక్కడైనా పోక్సో, లైంగిక దాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా కేంద్రానికి తీసుకొస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నామని అన్నారు. బాధితులకు న్యాయ పరమైన సూచనలు అందించి, వారికి ఎవరూ లేనప్పుడు భరోసా సెంటర్ లో ఆశ్రయం కల్పించాలన్నారు. వీటితో పాటు ఈ భరోసా కేంద్రాలు బాధితులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి, వారు సమాజంలో ఉన్నతంగా జీవించడానికి దోహదపడుతాయన్నారు. అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సిలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు, సమావేశ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, మంచిర్యాల షీ టీమ్ ఇంచార్జి ఎస్ఐ హైమ, సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్, సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.