- మంచిర్యాలలో బీసీ నేత గజెల్లి వెంకటయ్య నిరసన దీక్ష
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కులో పద్మశాలి సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, బీసీ నేత గజెల్లి వెంకటయ్య సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కోర్టుల సాకుతో బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి బీసీలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్లి, బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన విషయాన్ని ప్రభుత్వం మరువకూడదని, రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.







