– ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి
– గని మేనేజర్ ఈ. తిరుపతి
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి, రక్షణలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గని రారాజుగా ముందుకు సాగుతుందని గని మేనేజర్ ఈ. తిరుపతి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వారోత్సవాలు, ఎస్.డి.ఎల్ టెక్నాలజీలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి, సింగరేణి ఆవిర్భావ వేడుకలలో ఉత్తమ అధికారి, ఉద్యోగి విభాగాల్లో ఆర్కే6 గనికి బహుమతులు రావడం హర్షణీయమన్నారు. ఆర్కే6 గని కోల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వారిచే 4 స్టార్ రేటింగ్ పొందిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 110 శాతంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్పత్తిలో ఆర్కే6 గని సింగరేణి వ్యాప్తంగా ముందు వరుసలో ఉంటుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవ రెడ్డి, ఏజెంట్ ఏవి రెడ్డిల సహకారం, గని కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో ప్రమాద రహిత ఉత్పత్తి సాధిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2023వ సంవత్సరం తమకు అన్ని విధాల తీపి జ్ఞాపకాలు మిగిల్చిందని తెలిపారు. ఉద్యోగులు ప్రమాద రహిత ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ ఉద్యోగులు గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. పని స్థలాల్లో విధిగా రక్షణ పరికరాలు, రక్షణ సూత్రాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కొమురయ్య, ఫిట్ ఇంజనీర్ ఏ. శ్యామ్ కుమార్, సెక్షన్ ఇంజనీర్ ఆర్. మహేష్, అండర్ మేనేజర్లు శ్రీనివాస్, రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
195