- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆర్.కె న్యూస్, నస్పూర్: మహనీయులు తాము ఆచరించి చూపిన సన్మార్గం అందరికీ ఆదర్శనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావాత్ మోతిలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ లతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను కాపాడుతూ వారి ఆశయాలను భావితరాలకు అందించాలని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అని, మహనీయుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం, నాయకులు గుండేటి యోగేశ్వర్, చిలగాని బొడ్డయ్య, సుదర్శన్, గడ్డం సుధాకర్, బండి మల్లికార్జున్, దోమల రమేష్, టి.పి.సి.సి. జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్, బి.సి. సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.