శ్రీరాంపూర్ ఏరియాలో సేఫ్టీ మేనేజ్మెంట్ శిక్షణ శిబిరం ప్రారంభం
పది బ్యాచ్‌ల్లో 500 మంది కార్మికులకు శిక్షణ
ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో రక్షణతో కూడిన ఉత్పాదకత సాధించడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని వివిధ గనుల్లో ఐదు సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంశంపై సోమవారం రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని వృత్తి శిక్షణ కేంద్రంలో శ్రీరాంపూర్ జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పని చేసేటప్పుడు ప్రతి దశలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. “రక్షణే ప్రథమం – రక్షణ ఎల్లప్పుడూ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. రక్షణ చర్యలను నిరంతరం పాటించడం ద్వారా గనుల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని, ఇందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పని ప్రదేశాల్లో సమర్థవంతంగా అమలు చేసి, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కార్మికులకు దిశానిర్దేశం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఈ శిక్షణ కార్యక్రమాలు జనవరి 05 నుండి ఫిబ్రవరి 05 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయని జనరల్ మేనేజర్ వెల్లడించారు. మొత్తం పది బ్యాచ్‌లుగా ఈ శిక్షణను విభజించామని, ప్రతి బ్యాచ్‌లో సుమారు 50 మంది ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ శిక్షణా తరగతుల ద్వారా యువ కార్మికులకు గనుల రక్షణపై లోతైన అవగాహన కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఎస్వోటు ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, వృత్తి శిక్షణ కేంద్రం మేనేజర్ కమ్రుద్దీన్, సీమ్ టార్ డీజీఎం విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







