సింగరేణి బకాయిలు సాధిస్తే ఐఎన్టీయూసీ నేతలకు సన్మానం
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఐఎన్టీయూసీ నాయకులు గుర్తింపు సంఘంపై అనవసర విమర్శలు చేయడం మానుకొని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 45 వేల కోట్ల బకాయిలను వసూలు చేయడంలో ఐఎన్టీయూసీ నాయకులు చొరవ చూపాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ భారీ బకాయిలను వసూలు చేస్తే, తామే స్వయంగా ఐఎన్టీయూసీ నాయకులను ఘనంగా సన్మానిస్తామని ఆయన సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ. 19 వేల కోట్లు ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవి రూ. 45 వేల కోట్లకు చేరాయని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సింగరేణి సంస్థపైనే ఆధారపడిందని, ప్రస్తుత గందరగోళ పరిస్థితులకు ఐఎన్టీయూసీ, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆయన ఆరోపించారు. సంస్థలో సరైన పనిముట్లు అందుబాటులో లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అది తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న కార్మికులను ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించడానికి, పాత పద్ధతిలోనే స్పెషల్ ఇన్సెంటివ్‌లు అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని, మెడికల్ అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్‌లకు ఉపరితల విభాగాల్లో తగిన ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యం ఒప్పుకుందని తెలిపారు. బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ ట్రైనీ గా, సర్వే మజ్దూర్లను సర్వే అసిస్టెంట్ గా, సాంప్లింగ్ మజ్దూర్లను సాంప్లింగ్ అసిస్టెంట్ గా మారుస్తూ వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో ఒప్పందం జరుగుతుందని తెలిపారు. కార్మికుల పెర్క్స్ పై ఆదాయపు పన్ను చెల్లింపునకు సంబంధించి పర్సనల్ డిపార్ట్‌మెంట్ నుండి నోట్ ఆమోదం పొంది సీఎండీ వద్దకు వెళ్ళినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న ఐఎన్టీయూసీ నేతలు, డిప్యూటీ సీఎం ద్వారా ప్రకటన ఇప్పించడానికి ఆ ఫైలును అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అతి త్వరలోనే ఆదాయపు పన్ను చెల్లింపునకు సంబంధించిన సర్క్యులర్ వెలువడుతుందని కార్మికులకు భరోసా ఇచ్చారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల నిధులలో కోత విధించడం సరికాదని సీతారామయ్య మండిపడ్డారు. సంస్థకు సంబంధం లేని ఇతర విషయాల్లో నిధులను దుబారా చేస్తున్నారని, వచ్చే ఏడాది ఆవిర్భావ వేడుకలను గతంలో మాదిరిగానే వైభవంగా నిర్వహించేలా చూస్తామని తెలిపారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా హెడ్ ఆఫీస్‌లో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఐఎన్టీయూసీ నేతలకు అనుమతినిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఎస్.కె. బాజీ సైదా, అసిస్టెంట్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు చంద్రమోహన్, నాగభూషణం, శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, నాయకులు గునిగంటి నరసింహారావు, మురళి చౌదరి, సదానందం, యాదగిరి, శ్రీకాంత్, రమేష్, రవి, పవన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.







