మానవత్వం, ప్రేమ, కరుణే పండుగ సందేశం
ముఖ్య అతిథి రెవరెండ్ జోస్ మణికథన్
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్థానిక రెయిన్ బో పాఠశాలలో బుధవారం క్రిస్మస్ ముందస్తు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ రజనీ, కరస్పాండెంట్ అమన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాలలోని సేక్రెడ్ హార్ట్ ఫ్లోరెన్ చర్చి రెవరెండ్ జోస్ మణికథన్ విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో అలరించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. పండుగ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన అద్భుత ప్రదర్శనలకు గాను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్య అతిథి రెవరెండ్ జోస్ మణికథన్ మాట్లాడుతూ.. యేసుక్రీస్తు జననం వెనుక ఉన్న పరమార్థాన్ని, పండుగ విశిష్టతను వివరించారు. కరస్పాండెంట్ అమన్ ప్రసాద్ మాట్లాడుతూ.. క్రిస్మస్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది సమాజానికి దయాహృదయం, దానగుణం మరియు నిస్వార్థ ప్రేమ అనే గొప్ప సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ మాట్లాడుతూ.. రెయిన్ బో పాఠశాల ఎల్లప్పుడూ సర్వమత సమానత్వాన్ని బోధిస్తుందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశ గొప్పతనమని, అటువంటి విలువలను విద్యార్థులకు చిన్నతనం నుండే నేర్పించడం తమ బాధ్యత అని ఆమె సందేశాన్ని ఇచ్చారు.





