- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
ఆర్.కె న్యూస్, నస్పూర్: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల నుంచి కార్మికులకు 33 శాతం వాటా చెల్లించాలని, అంకెల గారడీతో కార్మికులను ఆర్థికంగా నష్టపరచటం సరి కాదని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సింగరేణి కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. సింగరేణికి రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నికర లాభాలు తక్కువగా చూపించి, కార్మికులకు తక్కువ లాభాల వాటా చెల్లించిందని, సింగరేణిని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఇటీవల రామగుండం ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన సమయంలో కోటి రూపాయల సింగరేణి ధనాన్ని వృధాగా ఖర్చు చేశారని అన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కార్మికుల పక్షాన ఉన్నారో లేదో స్పష్టం చేయాలన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని అన్నారు. ఒక్క ఎమ్మెల్యే సీట్ కోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం బాధాకరమని అన్నారు. నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నవేని సదానందం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, బిఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నాయకులు మహేందర్ వర్మ, బిజెపి జిల్లా నాయకులు మిట్టపల్లి మొగిలి, బింగి ప్రవీణ్, నస్పూర్ పట్టణ ఉపాధ్యక్షులు సామ్రాజ్ రమేష్, నాయకులు కొండ వెంకటేష్, చెల్ల విక్రమ్, గరిగెల కుమారస్వామి, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.