ఆర్.కె, నస్పూర్: గంజాయి పై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఏర్పాటు చేసిందని, విద్యార్థులు, యువత గంజాయికి దూరంగా ఉండాలని మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సిసిసి నస్పూర్ ఎస్ఐ ఎన్. సుగుణాకర్ లు తెలిపారు. ఆదివారం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, నస్పూర్ ఎస్ఐ ఎన్ సుగుణాకర్ గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువకులు, విద్యార్థులు గంజాయి, తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చాలామంది యువకులు విద్యార్థులు గంజాయికి బానిసై గొడవలు, కేసులతో తమ బంగారు భవిష్యత్తును అందాకారం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు సేవించే వారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుందని అన్నారు. కేసులు నమోదైన వారికి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించమని అన్నారు. గంజాయి సరఫరా, విక్రయించే వారి సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. గంజాయి నిర్మూలించడానికి టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టింగ్ లో పట్టుబడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
140