- ప్రైవేటు విద్యా సంస్థలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరువలేనిదని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నస్పూర్ మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు, నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సీబీఎస్ఈ విద్యా విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని 100 శాతం వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల నుంచి డొమెస్టిక్ కరెంట్ చార్జీలు వసూలు చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం నస్పూర్ మండల ఎంఈఓ జాడిపోచయ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు చిన్నతనం నుంచే నైతిక విలువలు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెతుల రాజేంద్రపాణి, జిల్లా గౌరవ అధ్యక్షులు బత్తిని దేవన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల అధ్యక్షులు మైదం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అమన్ ప్రసాద్, కోశాధికారి అంబాల రాజ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ ఇబ్రహీం, జిల్లా కోశాధికారి శ్యాంసుందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ లు రజిని, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, సన్నీ, ఎం ఆర్ సి దేవేంద్ర, శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.