వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జీఎం శ్రీనివాస్
కేరళ గురుస్వామిచే ప్రత్యేక పూజలు
నస్పూర్ , ఆర్.కె న్యూస్: లోక కళ్యాణార్థం శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 8న అయ్యప్ప స్వాముల మహా సంగమం, మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివ కుమార్, ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశం మాట్లాడుతూ.. ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు కేరళకు చెందిన ప్రముఖ గురుస్వామి బ్రహ్మశ్రీ సంజీవ నంభూద్రి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి మహా మండల పడిపూజ, అనంతరం అయ్యప్ప స్వాములచే అగ్ని ప్రవేశం (అగ్ని గుండాలు) కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆర్కే-8 కాలనీలోని విఘ్నేశ్వర ఆలయం నుండి భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో 108 మంది మహిళలు హారతులతో, అయ్యప్ప భక్తుల పేటతుల్లి నృత్యాలు, నగర సంకీర్తనలతో.. అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ యాత్ర ఆర్కే-6 గుడిసెలు, గాంధీనగర్, హిమ్మత్ నగర్ మీదుగా ప్రగతి స్టేడియం వరకు సాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు అయ్యప్ప స్వాములు, భక్తులకు భిక్షా (అన్నదానం) కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జిల్లా స్థాయి మహా సంగమానికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని సిరివంచ నుండి కూడా వేలాదిగా అయ్యప్ప స్వాములు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు చకిలం శ్రావణ్ చింటు, కార్యదర్శి పడాల లింగయ్య, దాసరి నవీన్, జమాల్ పూర్ శ్రావణ్, తళాల శివ, ఆనకారి హరీష్, ప్రసాద్, నాతాడి కొండాల్ రెడ్డి, దాసరి కళ్యాణ్, తాటిపాముల సత్యనారాయణ, జక్కెన రమేష్, ఎగ్గడి వినోద్ కుమార్, మాటూరి వంశీ, ఆడేటి అశోక్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.





