శాంటా క్లాస్, దేవదూతల వేషధారణలో అలరించిన చిన్నారులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల లక్ష్మీనగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ భారతీయ సంప్రదాయాలు, వివిధ పండుగల విశిష్టతపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ క్రిస్మస్ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. పండుగలు సోదరభావాన్ని, ప్రేమను పంచుతాయని ఆయన పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు శాంటా క్లాస్, దేవదూతల వేషధారణలో మెరిసిపోయారు. పాఠశాల ప్రాంగణం మొత్తం రంగురంగుల అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు ప్రదర్శించిన ‘జింగిల్ బెల్స్’ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల కేరింతలు, పాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్‌రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజారాణి, ఇంచార్జిలు అనగమత, పీఈటీ కిషన్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





