- ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తాం
- గుర్తింపు సంఘం నాయకులు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జెన్ కో, ట్రాన్స్ కోలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిందని, గత ప్రభుత్వ హయాంలో బొగ్గు అమ్మిన రూపాయలు 12 వేల కోట్లు, విద్యుత్ సరఫరా చేసిన రూపాయలు 17 వేల కోట్ల రూపాయలు సింగరేణి కి చెల్లించకుండా 29 వేల కోట్ల రూపాయల బకాయి ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగువేల కోట్ల వరకు బకాయిలు పడిందని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 33 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోతుందని, తద్వారా కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ, అభివృద్ధి, మిషనరీ కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వమే అని చెప్పుకు తిరిగే ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి సంస్థ మనుగడకు, విస్తరణకు సింగరేణి సంస్థకు రావాల్సిన 33 వేల కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు అవినీతికి తావు లేకుండా కార్మికులకు రావాల్సిన ప్రమోషన్స్, బదిలీలు పారదర్శకంగా చేస్తున్నామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని, కార్మికుల్లో ఏఐటీయూసీకి ఉన్న ఆదరాభిమానాలు చూడలేక కొన్ని కార్మిక సంఘాలు వారి మనుగడ కోసం ఏఐటీయూసీని విమర్శిస్తున్నాయన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కొరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సంపత్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు గజ్జి రమేష్, చంద్రశేఖర్, సిద్ధం అజయ్, తదితరులు పాల్గొన్నారు.