మణుగూరు బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలి
బిఎంఎస్ శ్రీరాంపూర్ ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మణుగూరు పీకే ఓసీ–2 ఎక్స్టెన్షన్ బ్లాక్‌ను సింగరేణిని పక్కన పెట్టి, జెన్ కో ద్వారా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం సంస్థ మనుగడపై దాడి అని ఆయన మండిపడ్డారు. గతంలో తాడిచెర్ల బ్లాక్ విషయంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి పాత ప్రకటనలకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఏఐటియుసి, ఐ.ఎన్.టి.యు.సి సంఘాలు అధికార పార్టీలకు కొమ్ముకాస్తూ కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. మణుగూరు బ్లాక్‌ను వెంటనే సింగరేణికే కేటాయించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.





