48
- ఐ.ఎన్.టి.యు.సి నాయకులు జెట్టి శంకర్ రావు, కాంపెల్లి సమ్మయ్య
- శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నస్పూర్, ఆర్.కె న్యూస్: పెండింగ్ లో ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్యలు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి, జీఎం ఎం. శ్రీనివాస్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల మొండివైఖరి, నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం, సింగరేణి పరిరక్షణకు నిరంతరం పోరాడుతామని అన్నారు. గత నెల 31న నిర్వహించిన మెడికల్ బోర్డు రద్దుచేసి పునః నిర్వహించాలని, అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయిన కార్మికులకు సర్ఫేస్ లో సూటబుల్ పని కల్పించాలని, కార్మికులు సొంతింటి కల నెరవేర్చాలని, అధికారుల మాదిరిగా కార్మికులకు పెర్క్స్ పై ఐటీ మినహాయింపు ఇవ్వాలని, నూతన భూగర్భ గనులు ప్రారంభించాలని, సేఫ్టీ ట్రైపార్టైట్ సమావేశాలు తిరిగి ప్రారంభించాలని, పాత క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్లు నిర్మించాలని, ప్రస్తుత బదిలీ విధానాన్ని రద్దు చేయాలని, నూతన ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది నియమించాలని, 35 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని, విజిలెన్స్ పెండింగ్ కేసులపై లోక్ అదాలత్ నిర్వహించాలని, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నాయకులు కలవేణి శ్యామ్, వెంకట స్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, శీలం చిన్నయ్య, మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, జీవన్ జోయల్, చాట్ల అశోక్, గోపాల్ రెడ్డి, చంద్ర మోహన్, మనోజ్, ప్రవీణ్, జగన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.