- రాజకీయ జోక్యానికి ఏఐటీయూసీ వ్యతిరేకం
- గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఈనెల 28న సింగరేణి డైరెక్టర్ (పా) ఆధ్వర్యంలో జరిగే స్ట్రక్చర్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ లు అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ, తాము గుర్తింపు సంఘం లెటర్ తీసుకున్న వెంటనే స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యానికి వినతి పత్రం అందజేశామని అన్నారు. సింగరేణిలో చాలా కాలం తర్వాత ఏఐటీయూసీ చొరవతో ఈ 28న డైరెక్టర్ (పా), డిసెంబర్ లో సీఎండీ స్థాయిలో స్ట్రక్చర్ సమావేశాలు జరుగనున్నట్లు తెలిపారు. యూనియన్ చందా చెల్లింపు విషయంలో కార్మిక చట్టాలపై అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు ఉద్దేశ్యపూర్వకంగా ఏఐటీయూసీని బదనాం చేయాలని చూస్తున్నాయని, కార్మికులు ఇచ్చిన చందా డబ్బులతో యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, కార్మిక సంఘాలు బలహీనమైతే యాజమాన్యానికి మేలు జరుగుతుందని అన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యానికి ఏఐటీయూసీ వ్యతిరేకమని, రాజకీయ జోక్యంతో కార్మికులకు, సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందన్నారు. డి.ఎం.ఎఫ్.టి, సి.ఎస్.ఆర్ నిధులు నిబంధనల మేరకు ఖర్చు చేయాలని అన్నారు. ఈనెల 26వ తేదిలోగా కార్మికులు ఐటీ చెల్లింపు విధానం ఎంచుకోవాలని సూచించారు. ఈనెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం ఇవ్వాలని, మారు పేర్లకు సంబంధించిన, విజిలెన్స్, వెల్ఫేర్, ఐఆర్ డిపార్ట్మెంట్లలో పెండింగ్ ఉన్న కేసులను రివ్యూ చేయాలని, మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మెన్, ఈపి ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయిమెంట్ ఇవ్వాలని, 11వ వేతన ఒప్పందంలో పెండింగ్ లో ఉన్న 14 రకాల అలవెన్సులు పెంచాలని, మెరిట్ స్కాలర్ షిప్, సింగరేణి మెడికల్ కాలేజీలో సింగరేణి కోటా ఎంబిబిఎస్ సీట్లు పెంచాలని, ట్రేడ్స్ మెన్లకు హెల్పర్ ఇవ్వాలని, తమ అపాయింట్మెంట్ నుంచి ప్రమోషన్ లేక సర్ఫేస్ డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న కొన్ని క్యాడర్ స్కీముల ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, సింగరేణిలోని క్యాంటీన్లు అన్నిటినీ యాజమాన్యమే నిర్వహించాలని, ప్రతి కార్మికునికి 25 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలని, కాంట్రాక్టు వర్కర్లకు కూడా క్యాంటీన్ సౌకర్యం ఇవ్వాలని, చాలా కాలం నుంచి ఇవ్వని ఈపీ ఆపరేటర్ల డి టు సి, సి టు బి ప్రమోషన్లు పూర్తి చేయాలనే ప్రధానమైన ఎజెండాతో సింగరేణి యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఒక్క స్ట్రక్చర్ సమావేశం జరగక పోయినా ఇతర కార్మిక సంఘాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. వచ్చే నెలలో సీఎండీ స్థాయిలో జరిగే స్ట్రక్చర్ సమావేశంలో పెర్క్స్ పై ఐటీ చెల్లింపు, కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయింపుతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఎస్కె బాజీ సైదా, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. కొమురయ్య, డివిజన్ నాయకుడు జి. సతీష్, పిట్ సెక్రటరీలు నర్సింగరావు, లచ్చన్న, నవీన్ రెడ్డి, నాగేశ్వర్ రావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు పరశురామ్, సందీప్, నాయకులు రాములు, దేవేందర్, రమణ, సురేష్,రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.