43
- వాస్తవ, నికర లాభాలను తక్షణమే ప్రకటించాలి
- టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 20న హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ, నికర లాభాలను ప్రకటించి దసరా లోపు కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేయాలని అన్నారు. సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి దక్కుతుందని అన్నారు. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈనెల 28న గనులు, విభాగాలపై, 29న జిఎం కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 2న కొత్తగూడెంలోని సింగరేణి కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కోల్ ఇండియా మాదిరిగా పెర్క్స్ పై ఐటి సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను రిటైర్మెంట్ కి 36 నెలల ముందుగానే మెడికల్ బోర్డుకు పిలవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులు వేలం లేకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని అన్నారు. ట్రాన్స్ఫర్ విధానాన్ని సరళీకృతం చేయాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని, క్లరికల్ సిబ్బంది కొరతతో కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని 2024 ఇట్లరికల్ ఇంటర్నల్ పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, జాయింట్ సెక్రటరీ పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండి లాల, బ్రాంచ్ సెక్రటరీలు వెంగళ కుమారస్వామి, గొల్ల సంతోష్, తొంగల రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, పిట్ కార్యదర్శులు గడ్డం సుధాకర్, రాజ్ కుమార్, బ్రాంచ్ నాయకులు తిరుపతి రావు, గోవిందుల రమేష్, రామగిరి సంపత్, సోషల్ మీడియా ఇంచార్జ్ సముద్రాల అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.