- ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యం
- మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలి
- సింగరేణి బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ. నాగేశ్వర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ పురోభివృద్ధిలో సంఖ్య పరంగా అధికంగా ఉన్న బీసీ ఉద్యోగుల పాత్ర కీలకమని సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ. నాగేశ్వర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని ఎస్.సి.ఓ.ఏ క్లబ్ లో సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం శ్రీరాంపూర్ ఏరియా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, యాక్టింగ్ బేస్డ్ ప్రమోషన్లలో రోస్టర్ విధానం ప్రకారం రిజర్వేషన్ అమలు జరగాలని, అధికారుల ప్రమోషన్ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. సింగరేణి యాజమాన్యం 11 ఏరియాలకు లైజనింగ్ అధికారిని నియమించడంతో పాటు కార్యాలయ వసతి కల్పించాలని అన్నారు. రాజకీయ, వర్గ, కుల, మతాలకు అతీతంగా చేసే ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని, అన్ని జీఎం కార్యాలయాల్లో జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని, శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియం పేరును మహాత్మ జ్యోతిరావు పూలే స్టేడియం అని మార్చాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీసీ ఉద్యోగులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించి తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, బలపడి ముందుకు సాగాలన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చీఫ్ లైజనింగ్ అధికారి నియామకం హర్షణీయమని అన్నారు. బీసీలు సమస్త సంపద సృష్టికర్తలని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గం పాలన జరగడం లేదన్నారు. రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షవర్గం ముస్కె సమ్మయ్య, పేరం రమేష్, పెట్టం లక్ష్మణ్, చీఫ్ అడ్వైజర్ చిలక శ్రీనివాస్, చీఫ్ లైజనింగ్ అధికారి పి. హరి శంకర్ రావు, యూనియన్ నాయకులు షేక్ బాజీ సైదా, జెట్టి శంకరరావు, శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జిఎం ఎన్. సత్యనారాయణ, డివైజియం (పర్సనల్) పి. అరవింద రావు, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, ఏరియా ఎస్సీ లైజనింగ్ అధికారి కిరణ్ కుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్. రాజేశ్వరరావు, ఏరియా నాయకులు బరుపటి మారుతి, బద్రి బుచ్చయ్య, బీసీ సంఘం నాయకులు రంగు రాజేశం, కర్రె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.